“ప్రతి బిడ్డా లోకానికి వెలుగే -- అదే సమయంలో దానిపాలిట చీకటికూడా; అందువల్లనే, విద్యను మౌలికప్రాధాన్యతాంశంగా పరిగణించవలె.”
— అబ్దుల్-బహా
చైతన్యం తొణికిసలాడుతున్న ఆ ప్రాంతంలోని వీధిగుండా, బాలల బృందం ఒకటి నవ్వులతో, కేరింతలతో బిలబిల నడుచుకుంటూ వస్తోంది. వారు దారిలోనే ఉన్న చెట్లపొదల్లోంచి పసుపుపచ్చరంగులో మెరిసిపోతున్న పూలను కోసుకుని, వారం వారం తమకు ఆధ్యాత్మిక లక్షణాలను బోధిస్తూ ఉండే ఒక యువమహిళ ఇంటికి తెచ్చి ఇస్తారు. గలగలమంటూ, తమ అధ్యాపకురాలిని పలకరించి, వారొక చాపను బైట పరిచి, దాని మధ్యభాగాన్ని తాము తెచ్చిన పూలతో అందంగా అలంకరిస్తారు; ప్రార్థనలకు సిద్ధమయ్యే క్రమంలో, వారంతా త్వరత్వరగా నిశ్శబ్దంగా కూర్చుండిపోతారు. తాము కంఠస్థంచేసి ఉన్న అనేక ప్రార్థనలను వారు గొంతెత్తి, భావయుక్తంగా చేస్తారు; అనంతరం, అధ్యాపకురాలు వారికొక సరిక్రొత్త ప్రార్థనను నేర్పుతుంది. తరువాత, వారొక పాటను పాడి, విశ్వసనీయత గురించి పవిత్రలేఖనాలనుండి ఒక భాగాన్ని చదివి చర్చించుకుంటారు; అదే అంశాన్ని ప్రస్తావిస్తూ కొనసాగే కథ ఒకదానిని ఆమె చెబుతుండగా శ్రద్ధగా వింటారు. తరువాత వారొక సహకారక్రీడలో చురుకుగా పాల్గొంటారు. అటుపై, తాము తెలుసుకున్న పవిత్రలేఖన భాగానికి సంబంధించిన రేఖాచిత్రానికి రంగులువేస్తూ దాదాపుగా ఒక విధమైన ధ్యానస్థితిలోకి వెళ్లిపోతారా బాలలు.
తరగతి క్రమరీతికి అలవాటుపడడంలో బాలలకు తోడ్పడే విషయంలో మొదట్లో కాస్తంత ఇబ్బందికి లోనౌతూ వచ్చినా, వారు సరైన ప్రవర్తనాసరళికి అలవాటుపడేందుకు కఠినమైన సాంప్రదాయిక క్రమశిక్షణా విధానాల వినియోగం అవసరం లేదని గ్రహిస్తుంది – అధ్యాపకురాలు; వాతావరణం, ప్రేమతో, పరస్పర సహకారంతో, గౌరవాదరాలతో నిండిఉంది, ఆధ్యాత్మికజీవితాన్ని గడపడమంటే ఏమిటన్న అవగాహన బాలల్లో పెరుగుతున్నది. ఇళ్లకు వెళ్లిపోగానే, వారు – తాము రంగులు వేసిన రేఖాచిత్రాలను తమ కుటుంబసభ్యులకు చూపిస్తారు; బాలలు ప్రతి ఉదయమూ, సాయంత్రమూ ప్రార్థనలను చేసే అలవాటును పెంపొందించుకోవడానికి తోడ్పడేలానూ, అలాగే తమతమ నివాసాలలో ఆధ్యాత్మిక/భక్తి సమావేశాలను నిర్వహించుకునేలానూ - వారి తల్లిదండ్రులను అధ్యాపకురాలు ప్రోత్సహిస్తుంది.
స్థానికంగా తమ చుట్టుప్రక్కల నివసించే బాలబాలికలకు నైతిక, ఆధ్యాత్మిక విద్యల నందించేందుకని, యువజనులూ, వయోజనులూ – స్త్రీలూ, పురుషులూ కూడా – సంబంధిత తరగతుల నిర్వహణను, తమ నివాసాలలో స్వాగతిస్తూనూ, ఆధ్యాపకులుగా సేవలను అందించేందుకూ ముందుకు వస్తున్న కారణంగా - భారతదేశవ్యాప్తంగా ఇలాంటి ఘట్టాలు వేలాదిగా చోటుచేసుకుంటున్నాయి, ఈ తరగతులలో ఏది ‘తప్పో’, ఏది ‘ఒప్పో’ తెలుసుకోవడం మీదనే దృష్టిని సారించడంకన్నా, ఆధ్యాత్మిక లక్షణాల అభివృద్ధి మీదనూ, తనను ఆధ్యాత్మికంగా సంపన్నుడిని చేసే ధార్మిక లక్షణాల, నమ్మకాల, అలవాట్ల, ప్రవర్తనారీతులను వ్యక్తి అన్నవాడు ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న దానికి విశేష ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. బాలబాలికలు అలవరచుకుంటున్న పరిజ్ఞానాన్ని పటిష్టపరిచేందుకుగాను, సమాజసభ్యులందరి తోనూ కలిసి కృషి చేయగలిగే స్ఫూర్తిని - సంబంధిత సామీప్యప్రాంత లేదా గ్రామజనాభాలోని సువిస్తృత భాగానికి - కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.