‘‘సమాలోచనము మహత్తరమగు అవగాహనము ననుగ్రహించును, ఊహను దృఢవిశ్వాసముగా పరివర్తిత మొనరించును. నిశీధప్రపంచమున పథమును జూపి, నిర్దేశించు శోభాయమాన దీపిక యిది. ఏలయన, అందున్నదియును, ఉండనున్నదియును పరిపూర్ణత, పరిపక్వతల స్థానమే. అవగాహనానుగ్రహ పరిపక్వత, సమాలోచన మూలకముగ వెల్లడియైనది.’’
— బహాఉల్లా
బహాఉల్లా ప్రతిపాదించిన దివ్యధర్మంలో పురోహితవ్యవస్థ లేదు. దీని వ్యవహారాలను – రహస్య ఓటింగ్ విధానంలో ఎన్నుకోబడిన స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయస్థాయి వ్యవస్థలు నిర్వహిస్తాయి. ఎన్నిక ప్రక్రియసైతం - ప్రచారమూ, సంరంభమూలాంటివి లేకుండానే జరుగుతుంది. ఈ వ్యవస్థకు ఎన్నుకోబడే విశ్వాసులకు వ్యక్తిగతంగా ఎలాంటి అధికారమూ ఉండదు; అయితే, వారు సభ్యులుగా ఉండే వ్యవస్థలకు చట్టపరమైన, నిర్వహణాపరమైన, న్యాయపరమైన పాలనాధికారాలు ఉంటాయి. బహాయి సమాజానికీ, సామాజికజీవిత అంతర్గత వ్యవహారాలకూ, ఆధ్యాత్మిక, భౌతికవనరుల వినియోగానికీ ఆయా వ్యవస్థలు బాధ్యత వహిస్తాయి.
బహాయి పాలనావిధానంలో అంతర్భాగమైన ఈ వ్యవస్థలు సమాలోచనా నియమ ప్రాతిపదికన పనిచేస్తాయి. ఈ నియమాన్ని అనుసరించి, వ్యవస్థల సభ్యులు, ప్రతి అంశంలోనూ సత్యాన్ని అన్వేషించేందుకు సమాలోచనలను వినియోగిస్తారు. వారు తమ అభిప్రాయాలను నిష్కర్షగానే పంచుకుంటారు, అయితే, తమ వ్యక్తిగతాభిప్రాయాలే చెల్లుబాటు కావాలని పట్టుబట్టరు. తద్భిన్నంగా, వాస్తవంపట్ల మరింత విస్తృతావగాహన కోసమని, వారు - సమస్యను అవతలివారి దృక్కోణంనుండి కూడా పరిశీలించి తెలుసుకుంటారు. తెలివిగా పరిస్థితులను వాడుకోవడం, పక్షపాతవైఖరి నవలంబించడం, వ్యక్తిగతప్రాధాన్యతలనో, ప్రయోజనాలనో ఇతరులపై రుద్దజూడడంవంటి పద్ధతులను పూర్తిగా త్యజించడం జరిగింది.