‘‘ఈ పవిత్ర దివ్యావతారమూర్తులు ప్రపంచమునకు వసంతాగమనము వంటివారు . . . . ఏలయన ప్రతి వసంతమును ఒక నవీనసృష్టి కాలమే. . . ’’



అబ్దుల్-బహా

భగవంతుడు బాబ్, బహాఉల్లా అనే ఇరువురు దివ్యవార్తాహరు లకు అప్పగించిన ఒక బృహత్కార్యంతో బహాయి దివ్యధర్మానికి నాంది జరిగింది. వారు సంస్థాపించిన దివ్యధర్మానికిగల విశిష్టైక్యత – తన నిర్యాణానంతరంకూడా తన మార్గదర్శకత్వం నిరంతరాయంగా లభిస్తూనే ఉంటుందని అభయమిచ్చిన బహాఉల్లా విస్పష్టాదేశాల నుండి ఉత్పన్న మౌతున్నది. దివ్యఒడంబడికగా ప్రస్తావించబడుతున్న ఈ వారసత్వం, బహాఉల్లానుండి ఆయన కుమారుడు అబ్దుల్-బహాకూ, అబ్దుల్-బహానుండి ఆయన మనవడు షోఘి ఎఫెండీకీ, తదనంతరం బహాఉల్లా నిర్దేశించిన విశ్వన్యాయమందిరానికీ సంక్రమిస్తూ వచ్చింది. బాబ్, బహాఉల్లాల దివ్యత్వస్థాయికీ, ఈ నియుక్తవారసుల సాధికారతకూ - బహాయిలు విధేయులుగా ఉంటారు.

బాబ్
బహాయి దివ్యధర్మ తొలిదూత - బాబ్. మానవజాతి ఆధ్యాత్మిక జీవితపరివర్తనకు ఉద్దేశింపబడిన ఒక మహత్తర దివ్యసందేశాన్ని తాను తీసుకువచ్చానని, 19వ శతాబ్దపు మధ్యభాగంలో ప్రకటించా డాయన. ఆయన దివ్యలక్ష్యం – తనకన్నా సమున్నతుడూ, శాంతికీ, న్యాయానికీ నెలవైన దివ్యయుగంలోనికి మానవాళికి మార్గదర్శకు డయ్యేవాడూ అయిన మరో దివ్యవార్తాహరుడి ఆగమనానికై మార్గాన్ని ఏర్పరచడం.

బహాఉల్లా
బాబ్ మాత్రమేకాక, ఆయనకు పూర్వులైన దివ్యవార్తాహరులు సైతం తమతమ లేఖనాలలో అంతకుముందే ప్రస్తావించిఉన్న వాగ్దత్తపురుషుడు – దైవజ్యోతిగా ప్రఖ్యాతుడైన బహాఉల్లా. ఆయన లేఖినినుండి దివ్యవాక్కులూ, లేఖలూ, లేఖనాలూ వేలాదిగా వెలువడ్డాయి. మానవజీవితంలోని ఆధ్యాత్మిక, భౌతిక పార్శ్వాలను పరిగణనలోకి తీసుకునే ఒక ప్రపంచ నాగరికతాభివృద్ధికి కార్యసారణిని తన దివ్యలేఖనాలలో ఆయన వివరించాడు. ఈ యత్నంలో, 40 సంవత్సరాల పాటు కారాగారవాసాన్నీ, చిత్రహింసలనూ, ప్రవాసశిక్షనూ అనుభవించా డాయన.

అబ్దుల్-బహా
బహాఉల్లా తన వీలునామాలో, తన పెద్దకుమారుడైన అబ్దుల్-బహాను తన బోధనలకు అధీకృతవ్యాఖ్యాతగా, దివ్యధర్మాధినేతగా నియమించాడు. శాంతిదూతగా, అసాధారణ మానవునిగా, ఒక నవీనదివ్యధర్మానికి చెందిన ప్రధానాధిపతిగా ప్రాచ్య, పాశ్చాత్య దేశాలలో ప్రఖ్యాతుడైనా డాయన.

షోఘి ఎఫెండీ
బహాయి దివ్యధర్మానికి సంరక్షకుడిగా అబ్దుల్-బహాచే నియమితుడైన ఆయన మనవడు షోఘి ఎఫెండీ – సమస్త మానవజాతి వైవిధ్యాన్నీ ప్రతిఫలించే దిశగా బహాయి సమాజం విస్తృతంగా అభివృద్ధి చెందుతూ ఉండగా, దానిని అభ్యుదయపథంలో పయనింపచేస్తూ, దాని అవగాహనను పెంపొందిస్తూ, ఐక్యతను శక్తిసమన్వితం గావిస్తూ 33 సంవత్సరాలపాటు సేవల నందించాడు.

విశ్వన్యాయ మందిరము
ప్రపంచవ్యాప్తంగా బహాయి దివ్యధర్మాభివృద్ధికి ఈనాడు దిశానిర్దేశం చేస్తున్నది – విశ్వన్యాయ మందిరము. మానవజాతి సంక్షేమంపై సానుకూలప్రభావాన్ని కలిగించ వలసిందనీ, విద్యను, శాంతిని, ప్రపంచసౌభాగ్యాన్ని ప్రోత్సహించ వలసిందనీ, వ్యక్తి గౌరవాన్ని, మతం స్థాయిని పరిరక్షించ వలసిందనీ తన శాసనగ్రంథంలో విశ్వన్యాయ మందిరాన్ని ఆదేశించాడు బహాఉల్లా.