“స్వాభావికంగా బలపరాక్రమలక్షణ సమన్వితమైనది కనుక మనిషి జీవితంలో ఎంతగానో కోరుకునేది – యౌవనదశ. కనుక, దైవశక్తితో అనుగ్రహీతులై, ఉన్నతాశయాలతో స్ఫూర్తినొంది, భగవంతుని అలౌకికశక్తితో, ఆయన అనుగ్రహాశీస్సుల సాహాయ్యమునొంది రేయింబవళ్లు మీరు శ్రమియింపవలె.”



అబ్దుల్-బహా

వ్యక్తి జీవితంలోయౌవనదశను – ప్రత్యేకించి, మానవజీవితానికి వసంతఋతువులాంటి – ఒక విశిష్టదశగా పరిగణిస్తుంది బహాయి సమాజం. యువతలోని మేధోపరమైన, ఆధ్యాత్మిక, భౌతికపరమైన శక్తి సామర్ధ్యాలను - ఈ దశ అంతటా - సామాజిక పరివర్తనదిశగా సారించడం జరిగినట్లైతే, తన నిజమైన సామర్ధ్యమేమిటో యువతకు తెలిసివస్తుంది, సమాజానికీ తెలుస్తుంది. వయస్సుపరంగా 11 నుండి 14 సంవత్సరాల మధ్యన, శారీరకంగానూ, మానసికంగానూ కూడా, తీవ్ర మార్పులు చోటుచేసుకునే సమయంలో- అంటే బాల్యంనుండి బైటపడి పరిపక్వత దిశగా పయనించే కౌమారదశలో - యువతకు ఒక ప్రత్యేకమైన సన్నద్ధత అవసరమౌతుంది. కిశోరప్రాయులుగా చెప్పబడే ఈ యువతరానికి, ఈ దశలో, ఎన్నో సరిక్రొత్త ప్రశ్నలు తలెత్తుతాయి, ఆశలూ, ఆశయాలూ కలుగుతాయి. ఈ వయోవర్గం తరచూ సమస్యాత్మకమైనదిగా పరిగణనను పొందుతూ, ప్రతికూల పదజాలంతో వ్యవహరించ బడుతున్న ఈ తరుణంలో, దీనికి – పరోపకారం, విశ్వంగురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత, న్యాయంపట్ల ఉండే స్పృహ, ప్రపంచశ్రేయస్సుకు కృషిచేయాలన్న ఉత్సాహం పరంగా ఉన్న సామర్ధ్యం పట్ల – గల అవగాహన ప్రాతిపదికగా, కిశోరప్రాయుల కార్యక్రమం ఒకదానికి రూపకల్పన చేయడం జరిగింది. సవాళ్లూ, అవకాశాలూ మెండుగా ఉన్న ఈ దశలో జీవనయానాన్ని కొనసాగించడంలో ఈ వయోవర్గానికి చెందినవారికి తోడ్పడే ఉద్దేశ్యంతో, బహాయి సమాజం ప్రపంచవ్యాప్తంగా కిశోరప్రాయుల ఆధ్యాత్మిక సశక్తీకరణ కార్యక్రమాన్ని అందిస్తున్నది.

ఈ కార్యక్రమంలో భాగంగా, 15 సంవత్సరాలకు పైబడిన వయస్సున్న యువతకు, తమ ప్రాంతాలలోని చిన్నచిన్న కిశోరప్రాయుల బృందాలకు తోడ్పాటును అందించే ‘ప్రయోక్తలు’ గా సేవల నందించేందుకు శిక్షణనివ్వడం జరుగుతున్నది. సదరు కిశోరప్రాయులు, తమ ప్రయోక్తల సాయంతో, తమ మనస్సులను తొలుస్తున్న లోతైన సమస్యలను సమీక్షిస్తారు. ఆధ్యాత్మికావగాహనను, సముచిత నిర్ణయాలను తీసుకోగల నైతికస్థితిని అభివృద్ధి చేసుకోవడంలో తమకు ఉపకరించే పాఠ్యాలను వారు అధ్యయనం చేస్తారు. సరైనతీరులో తమ భావాలను వ్యక్తీకరించగల శక్తిని పెంపొందించుకోవంలో ఆ పాఠ్యాలు వారికి తోడ్పడతాయి; తమ అపారశక్తి సామర్ధ్యాలను తమతమ సమాజాలకు సేవలనందించడానికి వెచ్చించేలా చేస్తాయి. వాస్తవాన్వేషణకు పురికొల్పే ఈ కార్యక్రమం - సమాజంలోని నిర్మాణాత్మక, వినాశకర శక్తులను విశ్లేషించుకోవడంలో వారికి తోడ్పడుతుంది; సానుకూలమైన మార్పుకై జరిగే యత్నాలతో వారిని అనుసంధానం చేస్తూనే, మరోవంకన - ఉన్నతులుగా వారికి గల నిజమైన గుర్తింపును దోచుకునే శక్తులను ఎదిరించడంలో - వారికి సహాయపడుతుంది. ప్రయోక్తలుగా సేవలను అందించేందుకు తమ విరామసమయాన్ని వెచ్చించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వేలమంది యువజనుల సహకారంతో, భారతదేశంలో మరెన్నో వేలమంది కిశోరప్రాయులు ప్రస్తుతం అలాంటి బృందాలలో భాగస్వాములౌతున్నారు.