‘‘మీరు నివసింపుచున్న యుగపు టవసరములనుగూర్చి తీవ్రముగ యోచింపుడు. మీ చర్చలను దాని యావశ్యకతల మీదను, అవసరముల మీదను కేంద్రీకరింపుడు.’’
— బహాఉల్లా
మానవాళి తన పరిపక్వతాస్థాయిని అందుకునేకొద్దీ, సామాజికజీవితానికి సంబంధించిన పలుఅంశాలలో పరివర్తన చెందవలసినవి – దానికి ఎదురౌతున్న మౌలికసమస్యల ధోరణులు, సంబంధిత ఆలోచనలు, భావనలు. కనుక, ఈ పరివర్తనాప్రక్రియకు ఆలోచనాస్థాయిలో తోడ్పడడం, ప్రపంచవ్యాప్త బహాయి సమాజానికి ప్రధాన జ్ఞానార్జనారంగమూ, ముఖ్యకర్తవ్యమూ కూడా. ప్రజాక్షేమానికి సంబంధించిన స్త్రీ పురుషసమానత, శాంతి, పాలన, ప్రజారోగ్యం, అభివృద్ధివంటి పలు అంశాలపై జరిగే చర్చలలో ఎలా పాల్గొనాలో బహాయిలు తెలుసుకుంటున్నారు.
ఈ చర్చలలో పాల్గొనడంలో ఉద్దేశ్యం – ఏదో ఒక అంశం గురించి బహాయిల వైఖరిని ఇతరులు ఆమోదించేలా ఒప్పించబోవడం కాదు; ఈ కార్యరంగాన్ని ఒక ప్రజాసంబంధాల కార్యక్రమంగానో, విద్యాసంబంధిత యత్నంగానో చేయడమూ జరగదు. దీన్నొక జ్ఞానార్జనాసరళిగానూ, మనఃపూర్వక చర్చలోకి ప్రవేశించాలన్న జిజ్ఞాసతోనూ బహాయిలు చేపడతారు; అందువల్ల, మానవాళికి ఎదురౌతున్న పర్యావరణ మార్పులు, మహిళల ఆరోగ్యం, ఆహారోత్పత్తి, పేదరిక నిర్మూలనవంటి అంశాల విషయంలో ఎలాంటి నిర్దిష్టపరిష్కారాలను సూచించే యత్నాన్నీ వారు చేయరు. అయినప్పటికీ, బహాఉల్లా బోధనలను నాగరికతాభివృద్ధికి అనువర్తింప చేయడంలో బహాయిలు తాము తెలుసుకుంటున్న అంశాలను, ప్రపంచవ్యాప్తంగా పలుసందర్భాలలో అందరితోనూ పంచుకోవడానికీ, భావసారూప్యతగల వ్యక్తులనుండీ, వ్యవస్థలనుండీ, వారితో కలిసీ – నేర్చుకోవడానికీ, ఉత్సుకతగా ఉంటున్నారు.
స్త్రీ పురుష సమానత్వం, సాంఘిక ఆర్ధికాభివృద్ధి, సంఘంలో మతం పాత్ర, బాలల హక్కులు, సమాజ పరివర్తనవంటి అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్న విస్తృత చరిత్ర భారతీయ బహాయిసమాజానికి ఉంది.