‘‘లిఖియింపబడిన దానిని వాస్తవరూపములోనికి, క్రియారూపములోనికి పరివర్తన మొనరించుటకై కృషిసల్పుట అంతర్దృష్టియుతుడును, అవగాహనాప్రపూరితుడును నగు ప్రతి మానవుని విధి.’’
— బహాఉల్లా
ఒక నిర్ణీత పట్టణప్రాంతంలోనో, గ్రామంలోనో సమాజనిర్మాణప్రక్రియ ఉధృతంగా సాగుతున్నప్పుడు, అందులో పాల్గొనే మిత్రులు అక్కడి ప్రజానీకం ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్ధికసమస్యలపైకి దృష్టిని సారిస్తారు. స్త్రీపురుష సమానత్వం, పర్యావరణం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యవంటి పలు స్థానికాంశాలనూ పరిష్కరించేక్రమంలో, వారికి బహాయి దివ్యధర్మబోధనలలో కొన్ని అవగాహనలూ, నియమాలూ గోచరిస్తాయి. అలాంటి సమస్యలను గురించిన అవగాహన ఏర్పడినప్పుడు – అధ్యయనకేంద్రాలలోనూ, కిశోరప్రాయుల బృందంలోనూ, సమిష్టి ఆరాధనలోనూ పాల్గొనడం ద్వారా – సంయుక్త దార్శనికతను సంతరించుకున్న మిత్రబృందాలు, తమ సమాజశ్రేయస్సుకు ప్రయత్నాలను చేయనారంభిస్తాయి. సామాన్యయత్నాలూ, సేవాపథకాలూ ఒక్కోసారి మరింత సుస్థిర, నిత్యకృత్యాలుగా, ఉదాహరణకు: ప్రత్యేక శిక్షణా (ట్యుటోరియల్) తరగతులుగా, సామాజిక పాఠశాలలుగా రూపాంతరం చెందుతాయి. వాటిల్లో కొన్ని, అనంతరకాలంలో మరింత సంకీర్ణతను సంతరించుకుని అభివృద్ధిసంస్థలుగా, బృహద్విద్యాలయాలుగా పరిణిత స్వరూపాన్ని సంతరించుకుంటాయి.
కృషికి సంబంధించిన రంగాలూ, సంకీర్ణతా స్థాయిలు వేరువేరుగా ఉన్నప్పటికీ, అలాంటి సామాజికకార్యక్రమ లక్ష్యాలన్నింటికీ ఏకసూత్రం: ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ ప్రగతిని సాధించడంలో మానవాళికి తోడ్పాటును అందించడంతోనూ; మానవజాతి ఏకత్వంపట్ల, న్యాయసిద్ధాంతంపట్ల నమ్మికతోనూ; తమ సమాజాల శ్రేయస్సుకు అవసరమైన పరిజ్ఞానకల్పన, అనువర్తనలలో భాగస్వాము లవడంలో అందరి శక్తిసామర్ధ్యాలనూ వినియోగించుకోవడంపట్ల ఏకాగ్రదృష్టితోనూ; సమాలోచన, అధ్యయనం, ఆచరణ, సమీక్షలతోకూడిన ఆవృత్తాలద్వారా, క్రియాశీల పరిజ్ఞానపూర్వక విధానయుతమైన ఒక దార్శనికత.