‘‘నాగరికత వికసించినది; దేశము లభివృద్ధి చెందినవి; శాస్త్రవిజ్ఞానము, తత్కల్పనలు, ఆవిష్కరణలుపెరిగినవి; మనుష్యప్రపంచము నిర్విరామముగ ప్రగతిని సాధిస్తున్నదని, అభివృద్ధిచెందుతున్నదని ఇవన్నీ నిరూపిస్తున్నాయి. కనుక, నిస్సందేహముగా, మానవపరిణితికి సహజములైన సుగుణము లవ్విధముగనే, విస్తరిల్లి అభివృద్ధి చెందుతాయి.’’
— అబ్దుల్-బహా
మానవజాతి ఇప్పు డొకసంధియుగంలో ఉంది, అది తన బాల్యావస్థకు సంబంధించిన అపరిపక్వతను విడిచిపెట్టి, పరిపక్వతాద్వారాన్ని సమీపిస్తున్నది. పూర్వవిధానాలు, సంస్థలు, సాంప్రదాయాలు సమకాలీన ప్రపంచంలోని సంక్లిష్టవాస్తవాలను ఇంకెంత మాత్రమూ ఎదుర్కొన లేకపోతున్న ఈ తరుణంలో, తన చుట్టూ ఉన్న ప్రపంచం లాగే భారతదేశమూ ఆశ్చర్యకర పరిణామాలకు లోనౌతున్నది. ఈ సంధికాలిక ప్రక్రియను వైయక్తిక స్థాయిలోనూ, సామాజికస్థాయిలోనూ దిశానిర్దేశం చేయడానికి నైతికపునరుజ్జీవనం జరగాలన్న బలమైన ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమౌతున్నది.
చారిత్రాత్మకంగా చూసుకుంటే, మానవస్వభావాన్ని చైతన్యపరచడంలో మతమే ప్రధానశక్తిగా వ్యవహరిస్తూ వచ్చింది; నీతికి, న్యాయానికి సంబంధించి అది అందించిన సహాయసహకారాలు సామాజికసరళిని సంరక్షించాయి. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జొరొతుష్ట్ర, మోషే, యేసుక్రీస్తు, మహమ్మదు ప్రవక్తవంటి దివ్యవార్తాహరులు, ఆయా యుగాల అవసరాలకు అనువైన ఆధ్యాత్మిక, నైతిక బోధనలను సమకూర్చడం ద్వారా నాగరికతను అభివృద్ధి చేశారు.
భగవంతుని దివ్యావిష్కరణ అనబడే నిరంతరప్రక్రియలో ఒక నవీనాధ్యాయమే – బహాయి దివ్యధర్మము. మానవాళి తన సమిష్టి పరిణామక్రమంలో మానవజాతి ఏకత్వాన్ని సాధించేందుకు అవసరమైన శక్తిసామర్ధ్యాలు లభ్యమౌతున్న ఒక విశిష్టదశలో ఉందని బహాయి దివ్యధర్మ సంస్థాపకప్రవక్త బహాఉల్లా వెల్లడించాడు. మానవజాతి పరిణితికి ప్రామాణికమైన ఈ ఏకీకరణస్థితి: వ్యక్తి, సమాజం, సమాజవ్యవస్థలు–ఈ మూడింటి జీవితాల సంపూర్ణ పునర్వ్యవస్థీకరణయే.
ఈ సంధియుగంలో బహాయి దివ్యధర్మలక్ష్యం: మానవకోటి ఏకత్వస్థానం దిశగా మనం పురోగమిస్తుండగా, మానవుడి ఆంతరంగిక జీవితపు క్రమానుగత పరివర్తనను ప్రోత్సహించడం, ప్రవృద్ధం గావించడం, పథనిర్దేశా న్నివ్వడం.